విజయవాడ : మీకు.. జలుబో, జ్వరమో వచ్చిందని దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లారనుకోండి.. అక్కడ డాక్టర్ పరీక్షించి.. మందులిస్తారు. దీంతో పాటు ఓ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఇస్తారు. ఆధార్ నంబర్ లానే ఈ నెంబర్‌ను కూడా జాగ్రత్త చేసుకోండి. ఆ తరువాత ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్లాల్సి వచ్చినా.. ఈ ఐడీ నంబర్ తీసుకెళ్లండి. వైద్య సిబ్బందికి ఈ ఐడీ నెంబర్ చెప్పగానే.. మీ ఆరోగ్యానికి సంబంధించిన గత చరిత్రను కూడా పరిశీలించి.. మీకు ఎలాంటి మందులిస్తే మీ జబ్బు త్వరగా నయమవుతుందో అవగాహనకు వస్తారు. దానికి తగ్గట్టే ఎప్పటికప్పుడు మందులు మారుస్తూ.. మీ జబ్బు నయం చేయడానికి ప్రయత్నిస్తారు.
ఇందుకోసం రూపొందించిందే ఈ ఔషధి. ఈ విధానం అమల్లోకొచ్చాక.. ప్రభుత్వాసుపత్రుల్లో అనవసరమైన వ్యయప్రయాసలు చాలా వరకు తగ్గిపోయాయి. వైద్య సిబ్బంది పని చాలా వరకు సులువైపోయింది. జవాబుదారీతనం, పారదర్శకత పెరిగాయి. దీంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులన్నీ ప్రభుత్వం వద్ద భద్రమవుతున్నాయి. ఈ కారణంగా.. ప్రజలు తరచూ ఏయే సమయాల్లో.. ఎలాంటి జబ్బులకు గురవుతున్నారు.. ఇందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలేంటన్న అంశంపై ప్రభుత్వం అప్రమత్తమవడానికి ఆస్కారమేర్పడుతోంది.
రోజుకు లక్ష మందికి వైద్యం
ఈ ఔషధి కింద ప్రభుత్వ ఆస్పత్రులు అందించే సేవలన్నీ.. ఆన్ లైన్ లోకి మారిపోయాయి. మందుల కొనుగోలు నుంచి వాటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేయడం వరకు అన్నీ ఆన్ లైన్ లోకి చేరిపోతున్నాయి. దీంతో హాస్పిటల్స్‌లో వైద్యం కోసం వచ్చే రోగులు, వారి జబ్బుల వివరాలే కాదు.. వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది వివరాలు, వారు అందిస్తున్న సేవలు సైతం ఈ ఔషధిలో ప్రత్యక్షమవుతున్నాయి. గతంలో మందుల కోసం ఇండెంట్ పెట్టి.. స్టాక్ రావడానికి వారం రోజులకు పైగా సమయం పట్టేది. వచ్చిన మందుల్ని క్షేత్రస్థాయికి చేరాలంటే మరో రెండు మూడు రోజులు పట్టేది. ఈ లోగా మందులు లేక రోగులు నానా అవస్థలు పడేవాళ్లు.
ప్రస్తుతం ఈ ఔషధి అమల్లోకి వచ్చాక.. అయిపోతున్న మందుల వివరాల్ని ముందుగానే నోట్ చేసుకుని ఆన్ లైన్ లో ఇండెంట్ పెట్టగానే.. ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే వాటిని తెప్పించుకోగలుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రులు దాదాపు రెండువేల వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో వైద్యం కోసం ప్రతిరోజూ సగటున లక్ష మంది వరకు రోగులు వస్తున్నారు. ఈ ఔషధి అమల్లోకి వచ్చాక.. ఇప్పటి వరకు మూడు కోట్లా నాలుగు లక్షల మందికి పైగా రోగులకు సంబంధించిన వివరాలు నమోదు చేశారు. రాష్ట్ర జనాభాలో సగానికన్నా ఎక్కువ మంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఈ ఔషధిలో ఉన్నాయి. 332 రకాల జబ్బులకు సంబంధించి, 600 రకాల మందుల్ని ప్రతి రోజూ రోగులకు అందేలా చేస్తోంది ప్రభుత్వం.
ఏడాది కాలంలో 150 కోట్ల మందు బిళ్లల పంపిణీ..
మామూలు జ్వరం నుంచి గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధుల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులిస్తున్నారు. వీటిలో 10 రకాల మందులకు మాత్రం హాస్పిటల్స్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ ఔషధి గణాంకాల ప్రకారం.. ఒక్క పారాసిటమాల్ ట్యాబ్లెట్లనే 22 కోట్లా, 52 లక్షల మందికి పైగా అందజేశారు. తలనొప్పి కోసం ఇచ్చే డైక్లోఫినాక్ సోడియం బిళ్లల్ని 20 కోట్లా, తొమ్మిది లక్షలకు పైగా అందజేశారు. 15 కోట్లా, 40 లక్షల రాంటిడైన్ ట్యాబ్లెట్లను రోగులకు అందజేశారు. ఆ తర్వాతి స్థానంలో 13 కోట్లా, 50 లక్షల బి కాంప్లెక్స్ బిళ్లలు పంపిణీ జరిగాయి. జలుబు, జ్వరం తదితర సమస్యలకు ఇచ్చే ట్యాబ్లెట్లు 10 కోట్లా, 70 లక్షలకు పైగా రోగులకు అందజేశారు. ఇవి కాక డి3 విటమిన్ తో కూడిన కాల్షియం కార్బొనేట్ మాత్రలు, మెట్ ఫార్మిన్ ట్యాబ్లెట్స్, పంటాప్రజోల్, అటెన్ లాల్, అమ్లోడైపిన్ వంటి 45 కోట్లకు పైగా మందు బిళ్లల్ని పంపిణీ చేశారు.