ప్రముఖ సీనియర్ సినీ నటి రాధిక డెంగీ జ్వరంతో బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. జూలై 28వ తేదీన ఆమె చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. ఆమెకు నిర్వహించిన వివిధ రకాలైన రక్త పరీక్షల్లో డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్టు తేలింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
అలాగే, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ నెల 5వ తేదీ వరకు చికిత్స అందించాల్సివుందని, ఆ తర్వాతే ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. మరోవైపు, డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, సహచరులు ప్రార్థిస్తున్నారు.
కాగా, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలతో పాటు అనేక టీవీ సీరియల్స్‌లో నటించిన రాధిక కోలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు. కేవలం ఒక నటిగానే కాకుండా ఒక విజయవంతమైన నిర్మాతగా కూడా ఆమె పేరొందారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో అయితే, ఏకంగా 15 వరకు చిత్రాల్లో నటించారు.