అల్పపీడనం వలన డిసెంబరు 3,4 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని గురువారం శ్రీకాకుళంలో మీడియాతో కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, అల్పపీడనంపై ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు క్షేత్ర స్ధాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని ఆయన సూచించారు.
రానున్న మూడు రోజుల వరకు రైతులు తమ పంటలను కోయరాదని, ఇప్పటికే కోసిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు, మరో మూడు ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు కేటాయించిందని చెప్పారు. తీరప్రాంత 12 మండలాల్లోని గ్రామ ప్రజలను, వరదలు సంభవించే అవకాశం ఉన్న 19 మండలాల ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
బలహీనంగా ఉన్న చెరువు గట్లు, కాలువ గట్లను గుర్తించి వాటి పటిష్ఠానికి అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కంట్రోల్ రూమ్ 08942 240557 ను ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయి అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు పెట్టకుండా తప్పనిసరిగా మండల కేంద్రాల్లో ఉండాలని ఆయన ఆదేశించారు. వంశధార, నాగావళి, మహీంద్రతనయ, బహుధా నదులకు సంబంధించి సాగునీటి వనరుల శాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.