నేడు - రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

శుక్రవారం, 2 జులై 2021 (09:40 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు గురువారం రాత్రి వెల్లడించారు. 
 
ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో విజయవాడలో అత్యధికంగా 99.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా నర్సాపూర్‌లో 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నెల్లూరులో 40.2 డిగ్రీలు, అత్యల్పంగా నందిగామలో 21 డిగ్రీలు నమోదైందని తెలిపారు.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లో రాగల 24 గంటల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తా, విదర్భ, దక్షిణ చత్తీస్‌గడ్‌ పరిసరాల్లో అల్పపీడన, దానికి అనుబంధంగా ఉపరితలం ఆవర్తనం కొనసాగుతున్నాయి. 
 
కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ, కోస్తాఆంధ్ర లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు