ఆంధ్రప్రదేశ్ అంతటా నగరాలు కులాన్ని బిసీలుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని, త్వరలో దీనిపై జీవో విడుదల అవుతుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.
విజయవాడలోని నగరాల సీతారామస్వామి దేవస్థానం వద్ద ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం కేంద్ర కార్యాలయ భవనం రెండో అంతస్తును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి జ్యోతి వెలిగించి, శుభాశీస్సులు అందించారు.
ఈ సంద్భంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నగరాలు అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీలో నగరాల కులాన్ని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో బీసీలుగా గుర్తించాలని తాను స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చానని చెప్పారు.
దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో దీనిపై జీవో కూడా ఇస్తారని హామీ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా జిల్లా లో ఉన్న నగరాలు కులస్తులను బీసీ లో చేర్చి సామాజిక న్యాయం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
నగరాలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ, నగరాలను మోస్ట్ బ్యాక్ వార్డ్ క్యాస్ట్ గా గుర్తించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడ పశ్చిమ, భీమిలిలో రెండు కమ్యూనిటీహాళ్ల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలని కోరారు.
13 జిల్లాలలో నగరాలు జాతి ఉద్ధరణే తమ లక్ష్యమని, అందుకే, జిల్లాల వారీగా కమిటీలను నియమించి సమైక్యపరుస్తున్నమని చెప్పారు. యువ నేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలు, ఆరోగ్యశ్రీ వంటి వైద్య సేవలు మనవారందరికీ అందేలా ఈ కమిటీలు సమన్వయం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎంపి గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరాలు సంఘం అధ్యక్షుడు బాయన వెంకటరావు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూధన రెడ్డి, పోతిన బేసి కంటేశ్వరుడు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకట రామారావు, దోనేపూడి శంకర్, జనసేన పార్టీ అధికార ప్రతనిధి పోతిన వెంకట మహేష్, పణుకు శేషు తదితరులు పాల్గొన్నారు.