అమ్మాయి పేరిట ఫ్రెండ్ రిక్వెస్ట్.. రూ.34 లక్షలకు టోకరా
గురువారం, 21 నవంబరు 2019 (11:37 IST)
ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయి పేరుతో పరిచయం చేసుకున్నారు. విశ్రాంత ఉద్యోగికి మాయమాటలు చెప్పారు. వాళ్ల బుట్టలో పడిపోయిన పెద్దాయన మొత్తం 34 లక్షల రూపాయల సొమ్ము వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేసేశారు. విశ్రాంత జీవితానికి ఉపయోగించుకోవాల్సిన సొమ్ము మొత్తాన్నీ ఒక్క ఫేస్‌బుక్ మోసంతో పోగొట్టుకొని పోలీసుల్ని ఆశ్రయించారు. ఇంత పెద్ద మోసానికి పాల్పడిన ముఠాను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.
కానీ సొమ్ము మొత్తాన్నీ రికవరీ చెయ్యలేకపోయారు. ఇంతకీ ఓ పెద్దాయన్ని సైబర్ నేరగాళ్లు ఎలా ట్రాప్ చేశారు? ఎంఎంటీఎస్‌లో పనిచేసి రిటైర్డ్ అయిన సోయమిర్ కుమార్ దాస్కు అన్నే రోజ్ అనే పేరుతో ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అవతలి మహిళ నమ్మకంగా మాట్లాడటంతో సోయమిర్ కుమార్ ఆమెతో ఫ్రెండ్షిప్ చేశారు. వ్యక్తిగత ఆర్థిక విషయాలు పంచుకునే స్థాయికి వాళ్ల స్నేహం వెళ్లింది.
తాను మాట్లాడుతున్నది సైబర్ మోసగాళ్లతో అని తెలియని సోమియర్ కుమార్.. తన రిటైర్డ్మెంట్ గురించీ.. తన ఆర్థిక స్థితిగతుల గురించి పంచుకున్నారు. ఈ క్రమంలో తాను విదేశాల్లో ఉంటున్నాననీ.. ఆయన పదవీవిరమణ చేశారు కాబట్టి గిఫ్ట్ కింద విలువైన బహుమతులు, విదేశీ కరెన్సీ పంపుతున్నానని సదరు మహిళ చెప్పారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ మరో కాల్ వచ్చింది. మీకు పెద్ద పార్శిల్ నిండా ఫారెన్ కరెన్సీ వచ్చింది.. అవి మీకు ఇవ్వాలంటే కస్టమ్స్ డ్యూటీ కట్టాలి అంటూ నమ్మబలికారు.
నిజమేననుకొని ఆయన.. తన ఏడు అకౌంట్ల వివరాలను వాళ్లకు చెప్పడమే కాకుండా.. 34,19,450 రూపాయల సొమ్మును వాళ్ల ఖాతాల్లోకి పంపేశారు. కట్టిన సొమ్ము మళ్లీ తిరిగి వచ్చేస్తుందనీ.. పైగా భారీగా డబ్బు కూడా వస్తున్నాయి కదా అనుకొని అంత పెద్ద మొత్తాన్ని ఆన్‌లైన్లో పంపేశారు. అంతే.. మళ్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్.. ఫే స్ బుక్ లోకి వెళ్లి చూస్తే అకౌంట్ క్లోజ్.. జరిగింది మోసమని గ్రహించిన సోమియర్ కుమార్ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు.
ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న విశాఖ పోలీసులు ఈ ముఠా ఢిల్లీ నుంచి తమ యాక్టివిటీస్ చేస్తోందని పసిగట్టారు. నేరుగా ఢిల్లీ వెళ్లి ఓ నైజీరియన్తో పాటు.. హర్యానాకు చెందిన కిషన్ లాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నది 2 లక్షల సొమ్ము మాత్రమే. మిగతా 32 లక్షల సొమ్ము అసలు రికవరీ అవుతుందా లేదా కూడా తెలియని పరిస్థితి.
అలాగే 95 సిమ్ కార్డులు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారంటే సిమ్ కార్డులు మార్చి మార్చి దేశవ్యాప్తంగా ఈ ముఠా ఎలాంటి మోసాలకు పాల్పడుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే సైబర్ క్రైమ్ పోలీసులు నేరుగా పరిచయం లేని వ్యక్తులతో ఎప్పుడూ ఆర్థిక లావాదేవీలు చెయ్యకూడదనీ, అసలు సోషల్ మీడియా స్నేహాలనే నమ్మకండి అని చెబుతున్నారు.