అమ్మాయిలతో వ్యాపారం.... ఉన్నత చదువులు చదివి ఊచలు లెక్కిస్తున్నాడు...

మంగళవారం, 8 జనవరి 2019 (16:14 IST)
అతనో ఉన్నత విద్యనభ్యసించిన వ్యక్తి. బి.టెక్. పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ దొరకలేదు. ఇంట్లో తల్లిదండ్రులు ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదు. కోపంతో ఊగిపోయాడు. సులువుగా డబ్బులు సంపాదించడం ఎలాగో ఆలోచించాడు. తన స్నేహితుల సలహాతో వ్యభిచార గృహం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. చివరకు ఆ గృహం నడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు.
 
గుంటూరు జిల్లా చిలకులూరిపేట సమీపంలోని ఒక గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు మణికంఠ. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలను గుర్తించాడు. వారికి డబ్బును ఎరచూపాడు. వ్యభిచార గృహానికి తీసుకొచ్చి ఆ బిజినెస్‌ను మూడు పువ్వులు ఆరు కాయల్లా నడిపాడు. ఆరునెలల పాటు ముగ్గురు మహిళలతో ఈ బిజినెస్ బాగా జరిగింది. మరో ఇద్దరు యువతులు ఇందులో చేరారు. డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో ఏకంగా ఆన్‌లైన్‌లో బిజినెస్ మొదలుపెట్టాడు. అడ్డంగా దొరికిపోయాడు.
 
మణికంఠ నెంబర్‌ను గుర్తించిన పోలీసులు సులువుగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహంపై దాడి చేసి ఆరుగురు మహిళలు, ఆరుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. కొసమెరుపు ఏమిటంటే తాను చేస్తున్న బిజినెస్ గురించి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా మణికంఠ జాగ్రత్తపడ్డాడు. కానీ చివరకు ఆన్‌లైన్‌లో బిజినెస్ మణికంఠ జీవితాన్నే మార్చేసింది. ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు