మతం కంటే మానవత్వం గొప్పది: నారా భువనేశ్వరి

శుక్రవారం, 11 జూన్ 2021 (22:17 IST)
కరోనా విపత్తు సమయంలో ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ విశిష్టమైన సేవలు అందిస్తోందని ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు తెలిపారు. శుక్రవారం నాడు ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘కరోనా సమయంలో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిపుణులైన వైద్యులతో ఆన్‌లైన్‌లో వైద్యసేవలు అందించడం జరుగుతోంది. ఇప్పటివరకు 782 మందికి పైగా సేవలు అందించగా, 480 మంది పూర్తిగా కోలుకున్నారు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కూడా ప్రజలకు అందించడం జరుగుతోంది.

సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు నాన్న గారి ఆశయానికి అనుగుణంగా కరోనా బాధితులకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారికి టెలీమెడిసిన్ ద్వారా వైద్య సహాయం, అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు తాజాగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచాం. మతం కంటే.. మానవత్వం ముఖ్యమన్న నినాదంతో ముందుకు సాగుతున్నాం.

24/7 కాల్ సెంటర్ అందుబాటులోకి తెచ్చి... అవసరమైన వారికి ఇళ్లవద్దకే మందులు పంపిణీ చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండరాదన్న లక్ష్యంతో హోం ఐసోలేషన్లో ఉన్నవారికి పౌష్టికాహారం అందిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు 78వేల మందికి ఆహారం అందించాం. అవసరమైతే మరింతగా అన్నదాన కార్యక్రమాలు చేపడతాం. ఆపన్నులకు అండగా నిలుస్తాం.


కుటుంబసభ్యులు ముందుకురాని, అనాధ శవాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవావిభాగం ఆధ్వర్యంలో వారివారి ఆచారాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతం చేసి.. పేదలకు తామున్నామనే భరోసా కల్పిస్తాం. మానవ సేవే మాధవ సేవ అనే నినాదం స్పూర్తిగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ సీఈవో రాజేంద్రప్రసాద్‌, ప్రముఖ వైద్యులు డా॥ లోకేశ్వరరావు, డా॥ నిరంజన్‌ మోటూరి, డా॥ శేషగిరి, డా॥ పాండురంగ తదితరులు పాల్గొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు