బంగారుతల్లి నీకు అన్యాయం చేసి చనిపోతున్నా... కన్నబిడ్డకు అమ్మ లేఖ

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (09:38 IST)
ఓ వివాహిత భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడేముందు తన కన్నబిడ్డను ఉద్దేశించి ఓ లేఖ రాసిపెట్టింది. "బంగారుతల్లి నీకు అన్యాయం చేసి చనిపోతున్నా, నన్ను ఎవరూ చంపలేదు నేనే చనిపోతున్నాను. ఏడవొద్దు ఎవరినీ ఏడిపించవద్దు" అని రాసిపెట్టింది. పైగా, తన దేహాన్ని అత్తవారింటివారు ఎవరూ తాకొద్దని, అమ్మానాన్నలే దహన సంస్కారాలు చేయాలని ఇదే తన చివరి కోరిక అంటూ పేర్కొంది. హృదయాన్ని కదిలించే ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన రేమల్లె మురళీకృష్ణ భార్య కృష్ణవేణి(34) అనే వివాహి ప్రభుత్వ వికలాంగులశాఖ విభాగంలో ఫిజియోథెరఫీగా పని చేస్తోంది. ఈమె గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త మురళీకృష్ణ ఖమ్మం వెళ్లగా 8 యేళ్ళ కూతురు స్కూల్‌కు వెళ్లింది. మధ్యాహ్నం స్కూల్‌ నుంచి వచ్చిన కూతురు తలుపు కొట్టగా ఎంతకూ తీయలేదు. 
 
దీంతో ఆమె వెనుకాలే ఉంటున్న కృష్ణవేణికి వరుసకు తమ్ముడు కిరణ్‌ ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. వాళ్లు వచ్చి ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. అనుమానం వచ్చి పక్కసందులో ఉన్న కిటికీలోనుంచి చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయగా, వారు వచ్చి మృతదేహాన్ని కిందికి దించారు. ఆ తర్వాత ఆమె సొంతంగా కూతురు పేరుమీద రాసిన రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖ చివర్లో గుడ్‌బై మిస్టర్ శాడిస్ట్ అంటూ రాసిపెట్టింది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండటం వల్లే ఆ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి