హైదరాబాద్‌లో ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం జరిగింది. ఈ ప్రాంతం మంచిది కాదు... ఇక్కడ ఉండొద్దు.. పైగా ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్లొద్దంటూ.. నేను ఇంటికి తీసుకెళ్తా అంటూ నమ్మించి... కావాల్సిన చోటికి తీసుకెళ్లి వదిలిపెడతానంటూ నమ్మించి క్యాబ్ ఎక్కించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో చివరకు ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
హైదరాబాద్ శివార్లలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లి హ్యపీహోమ్స్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (24) ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తోంది. సోమవారం అర్థరాత్రి ఆమెకు మందులు అవసరం ఉండడంతో పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 216 ప్రాంతానికి వచ్చింది. అక్కడ షాపులన్నీ మూసి ఉండటంతో రోడ్డు పక్కన నిలబడి ఉండగా... ఓ తెలుపు రంగు క్యాబ్ వచ్చి ఆమె వద్ద ఆగింది.
ఆ క్యాబ్ డ్రైవర్ ఆ యువతి వద్దకు వచ్చి ఇక్కడ ఎందుకు నిల్చున్నావని ప్రశ్నించాడు. ఆ ప్రాంతం మంచిది కాదని, ఒంటరిగా ఉండడం ప్రమాదకరమన్నాడు. 'మీ ఇంటిదగ్గర వదిలేస్తా రమ్మ'ని నమ్మించి వాహనంలో ఎక్కించుకున్నాడు. వేగంగా రాజేంద్రనగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు.
ఆ యువతి గట్టిగా ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు. అయినా ఆమె నిలువరించడం, గట్టిగా కేకలు వేస్తుండడంతో... ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. వెంటనే ఆ యువతి రోడ్డుపైకి వచ్చి సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారయత్నం, దోపిడీ కింద కేసులు నమోదు చేశారు.