భర్త తలపై రోకలి బండతో దాడి.. ఆపై కత్తితో గాయపర్చుకున్న భార్య.. ఎందుకు?

శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:15 IST)
ఇటీవల సైదారాబాద్‌లో పట్టపగలు వృద్ధ దంపతులపై దాడి, దోపిడీ కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇల్లు ఖాళీ చేసే విషయంపై భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. దీంతో భార్య రోకలిబండతో భర్తపై దాడి చేసి ఇంట్లో కత్తితో తనకు తాను గాయపపర్చుకుని దొంగల దాడిగా సృష్టించినట్టు పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సైదాబాద్‌ పర్హాకాలనీలో ట్రాన్స్‌కో రిటైర్డ్‌ ఏఈ షరాప్‌ వామనమూర్తి (75). భార్య అనురాధ (65) నివాసముంటున్నారు. ఉద్యోగరీత్యా కుమారుడు అమీర్‌పేటలో, కూతురు బెంగళూర్‌లో నివసిస్తున్నారు. వామనమూర్తికి అప్పులు అధికం కావడంతో పర్హాకాలనీలోని ఉంటున్న ఇంటిని 2017లో రూ.60 లక్షలు విక్రయించారు. కానీ, ఇల్లు ఖాళీ చేయకపోవడంతో కొనుగోలు చేసిన వారు ఏడాదిన్నర కాలంగా ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు.
 
ఈ క్రమంలో ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడ ఉండాలన్న బాధ, డబ్బుల విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో ఆమె రోకలిబండతో భర్త తలపై రెండు సార్లు బలంగా మోదింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇంటి వెనుక బాత్‌రూంలోకి వెళ్లి తలపై నీళ్లు పోసుకుని అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పనిమనిషితో.. ఈ విషయం బయటకు చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది. 
 
అనంతరం పనిమనిషి బయటకు వెళ్లింది. కొద్దిసేపటికి అనురాధ తనకు తాను కత్తితో గాయపర్చుకుని బయటకు పరుగెత్తి పొరుగింటి వారిని పిలిచి దోపిడీ దొంగల బీభత్సంగా నమ్మబలికింది. చేతులకు గాయాలైన అనురాధను, ఇంటి వెనుక బాత్‌రూమ్‌లో కుప్పకూలిన వామనమూర్తిని స్థానికులు చికిత్స నిమి త్తం మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దాడిపై ఆరా తీయగా ఈ వృద్ధ దంపతుల డ్రామా వెలుగులోకి వచ్చింది. అనురాధ తమపై దోపిడీ దొంగలు దాడి చేసి పారిపోయారని పోలీసులకు చెప్పడంతో ఇంటి ముందున్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఉదయం 11.30 గంటలకు పనిమనిషి బయటకు వెళ్లిన తర్వాత 11.40 గంటల వరకు ఇతరులు ఎవరూ లోపలికి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. వెనుక ప్రాంతాలలో సైతం సీసీ ఫుటేజీని పరిశీలించి దొంగలు ఎవరూ రాలేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు సంఘటన జరిగిన సమయంలో దంపతులు ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలుసుకున్నారు. అంతకు ముందు ఇంటి నుంచి వెళ్లిన పనిమనిషిని పోలీసులు విచారించగా వారి గుట్టు రట్టయిందని సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు