తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయి. అలాగే, అన్ని అర్హతలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సరైన ప్రమోషన్ల దక్కలేదని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, వివిధ రకాల దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ నర్సు ప్రమోషన్ ఇవ్వలేదన్న కోపంతో అధికారుల ఎదుటే బ్లేడుతో గొంతు కోసుకుంది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కాగా, ప్రస్తుతం ఆమె అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో ఉన్న నిమ్స్ ఆస్పత్రిలో నిర్మల అనే నర్స్ పని చేస్తోంది. స్టోర్స్ విభాగంలో విధులు నిర్వహించే ఈమె.. గత కొంతకాలంగా తనకు అర్హత ఉన్నప్పటికీ ప్రమోషన్ ఇవ్వకుండా పై అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతూ వచ్చారు.
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆస్పత్రి డైరెక్టర్ మనోహర్‌లను కలిసేందుకు వారి ఛాంబర్ల వద్దకు వెళ్లగా.. వారు భోజనం చేస్తున్నారని అక్కడి సిబ్బంది చెప్పారన్నారు. దీంతో ఆమె నైరాశ్యంతో వెంట తెచ్చుకున్న ఆపరేషన్ బ్లేడ్‌తో గొంతుకోసుకున్నారని వివరించారు. అర్హతలున్నప్పటికీ తనకు ప్రమోషన్ ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.