హైదరాబాద్‌లోని నాంపల్లి నుమాయిష్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రతి యేడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. దీన్ని తిలకించేందుకు 45 రోజుల్లో దాదాపు 30 లక్షల మంది వరకు వస్తుంటారు. కానీ, బుధవారం ఈ ప్రదర్శనలో ఉన్నట్టుండి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో మహేష్ బ్యాంక్ స్టాల్‌లో ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అక్కడే ఉన్న అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం చేరవేశారు. అయితే, తమ పై అధికారులకు సమాచారం చేరవేయడం మినహా మరేం చేయలేక పోయారు. దీనికి కారణం... ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ముందస్తుగా ఉంచిన ఫైరింజన్‌లో చుక్క నీరు లేదు. దీంతో సిబ్బంది ఏం చేయలేక మంటలను చూస్తుండిపోయారు.
ఫైరింజన్‌లో నీరు ఉండివుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగివుండేది కాదని, కేవలం రెండు నిమిషాల్లో వచ్చి మంటలను ఆర్పివుండవచ్చని స్టాల్స్ నిర్వాహకులు వాపోతున్నారు. తమవద్ద నుంచి అద్దెలు, కరెంట్ బిల్లుల పేరిట లక్షల రూపాయలు దోచుకుంటున్న నుమాయిష్ నిర్వాహకులు, ఇప్పుడు నష్టాన్ని భరించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో ఖాళీ ఫైర్ ఇంజన్‌ను నిలిపివుంచడంపైనా విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు, అగ్నిప్రమాదం వందలాది మంది వ్యాపారులకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. మంటలు ఒక్కో దుకాణానికి వ్యాపిస్తుంటే, ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. సందర్శకులు మాత్రం తమ చేతికి దొరికిన వస్తువులను దొరికినట్టు దొరకబుచ్చుకుని బయటి గేట్ల వైపు పరుగులు తీశారు.