ఎంబీఏ గోల్డ్‌మెడల్... జల్సాల కోసం ఏం చేశాడో తెలుసా?

గురువారం, 21 మార్చి 2019 (13:44 IST)
అతనో ఎంబీఏ పట్టభద్రుడు. పైగా గోల్డ్‌మెడలిస్టు. ఉన్నత విద్యను పూర్తి చేసినా తనలోని వ్యసనాలను మాత్రం మానలేక పోయాడు. దీంతో జల్సాల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లాకు చెందిన వంశీకృష్ణ 2004లో ఎంబీఏ పూర్తి చేసి గోల్డ్‌‌మెడల్‌ సాధించాడు. తర్వాత ఉద్యోగం కోసం పలు కంపెనీల మెట్లెక్కిదిగాడు. కానీ, ఎక్కడా సరైన ఉద్యోగం లభించలేదు. అదేసమయంలో మనోడు జల్సాలకు అలవాటుపడ్డాడు. ఫలితంగా గోల్డ్‌మెడలిస్టు కాస్త దొంగగా మారిపోయాడు. 
 
తన మకాంను ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. హైదరాబాద్ నగరంలో తాళం వేసి ఉన్న గృహాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడసాగాడు. చోరీ సొమ్మును ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదుపెట్టి ఆ డబ్బుతో లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడి ఎంజాయ్ చేయసాగాడు. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా 13 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో 2006 నుంచి పలుమార్లు పోలీసులకు చిక్కినప్పటికీ తన వృత్తిని మాత్రం మానలేదు. ఈ క్రమంలో కమిషనరేట్‌ పరిధిలో వరుస దొంగతనాలపై నిఘా పెంచిన పోలీసులు వంశీకృష్ణను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి 800 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు సహా రూ.30 లక్షల ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు