ఇటీవలికాలంలో పలువురు యువతులు సోషల్ మీడియా పుణ్యమాని మోసపోతున్నారు. ముఖ్యంగా, ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి వాటిలో చాటింగ్ చేస్తూ అవతలి వ్యక్తుల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఓ యువతి టిక్‌టాక్ మాయలో పడి ఓ వ్యక్తి చేతిలో మోసపోవడమేకాదు ఏకంగా అత్యాచారానికి గురైంది. చివరకు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకుని పత్తాలేకుండా పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన యువతి (27)కి గతేడాది డిసెంబరులో తలాబ్‌కట్ట నషేమన్ నగర్‌కు చెందిన అక్బర్ షా (34) అనే వ్యక్తి టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరి మధ్య కొద్దిరోజుల పాటు చాటింగ్ జరిగింది. ఆ తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటూ అక్బర్ షా ఆ యువతికి వల వేశాడు. అంతే.. అక్బర్ షా వలలో ఆ యువతి పడిపోయింది.
అయితే, నిజానికి అక్బర్ షాకు అప్పటికే వివాహమై నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, యువతి వద్ద తమ పెళ్లి విషయం దాచిపెట్టాడు. ఆ తర్వాత యువతిని టోలీచౌకిలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.