తొందరపడి రెండో పెళ్లి చేసుకున్న వైద్యురాలు.. జీవితంపై విరక్తితో సూసైడ్

శుక్రవారం, 13 డిశెంబరు 2019 (13:28 IST)
ఓ వైద్యురాలు రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె ఆలోచన మారింది. తొందరపడి రెండో పెళ్ళి చేసుకున్నట్టు లోలోప మథనపడింది. రెండో భర్త ఎలా చూసుకుంటాడోనన్న ఆందోళన ఆమెలో మొదలైంది. అంతే, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, కళ్యాణ్‌ నగర్‌‌కు చెందిన శ్రావణి (35) అనే మహిళ ఓ వైద్యురాలిగా కొనసాగుతోంది. ఈమెకు కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, భర్తతో ఏర్పడిన మనస్పర్థలు కారణంగా విడిపోయింది. 
 
ఈ పరిస్థితుల్లో గత నవంబరు నెలలో శ్రీనివాస్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తన ఉద్యోగం నిమిత్తం శ్రీనివాస్ తమిళనాడుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆమె బాత్ రూమ్‌లో కిటికీకి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. బయటి నుంచి ఎంతసేపు తలుపు తట్టినా సమాధారం లేకపోవడంతో, అనుమానం వచ్చిన తల్లి, చుట్టుపక్కల వారి సాయంతో లోపలికి వెళ్లి చూడగా, శ్రావణి విగతజీవిగా కనిపించింది.
 
విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని శ్రావణి రాసిన ఆత్మహత్యా లేఖను స్వాధీనం చేసుకున్నారు. తల్లి దండ్రులు తనను బాగా చూసుకున్నారని, తానే రెండో పెళ్లికి తొందర పడ్డానని, కొత్తగా తన జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఎలా చూసుకుంటాడో తెలియడం లేదని ఆందోళనగా అందులో రాసింది. పైగా, ఈ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని పేర్కొంది. తనకే జీవితంపై విరక్తి కలిగి, ఈ పనికి పాల్పడినట్టు పేర్కొంది. దీంతో పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు