మహిమ గల దేవతా విగ్రహాలని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను విజయనగరం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వ్యాపారాలలో నష్టపోయిన వారిని టార్గెట్ చేస్తూ, విగ్రహాల అమ్మకాలు జరుపుతోంది ఈ ముఠా.
1818 సంవత్సరానికి చెందిన ఈస్టిండియా కంపెనీ సిపాయి విగ్రహాన్ని 5 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నం చేసారు. నెల్లిమర్ల మండలానికి చెందిన కాళ్ళ మహేష్ కు మహిమగల దేవతా విగ్రహాన్ని అమ్మేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేవతా విగ్రహం ఇస్తామని 20వేలు తీసుకుని సిపాయి విగ్రహం ఇవ్వడంతో ముఠా మోసం బయటపడింది.
అదొక రాజనాల విగ్రహ ముఠా. ఆ ముఠాలో రాజనాల శ్రీనివాస్ రావు తో పాటు రొంగలి రామ సత్యం, పైడా వెంకట్ రావు, దివాకర్ కిరణ్ కుమార్, మరొక వ్యక్తి కలిపి ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ టీంను లీడ్ చేసేది రాజనాల శ్రీనివాస్ రావు. ఈయన రొంగలి రామ సత్యంతో కలిసి విజయనగరంలో గాయత్రి బోర్ వెల్స్ ని నిర్వహిస్తున్నారు. వీరి వద్ద దివాకర్ కిరణ్ కుమార్ పని చేస్తున్నాడు. రాజనాల కి పైడా వెంకట్ రావు స్నేహితుడు.
ముఠా లీడర్ రాజనాలకి మహిమ గల విగ్రహాల పిచ్చి ఎక్కువ. అడ్డదారిలో అతి వేగంగా ధనవంతుడై పోవాలన్న అత్యాశ రాజనాలను మహిమ గల విగ్రహాల వైపు అన్వేషణ సాగేలా చేసింది. అలా ఆ పిచ్చిలో పడి, అత్యాశతో ఈస్ట్ ఇండియా పేరుతో ఉన్న ఒక పురాతన సిపాయి విగ్రహాన్ని కొనుగోలు కూడా చేసాడు. కానీ ఆ విగ్రహం తెచ్చుకున్న నాటి నుంచి వ్యాపారాల్లో మరిన్ని ఎక్కువ నష్టాలను రాజనాల చవి చూసాడట. దీంతో తను కొనుగోలు చేసిన రెండు వందల ఏళ్ల నాటి ఆ పురాతన విగ్రహాన్ని ఎవరికైనా అమ్మేయాలని ఆలోచన మొదలు పెట్టాడు. అందుకు తగ్గట్టుగా తన టీంను రెడీ చేసుకున్నాడు.
తన స్నేహితుడు పైడా వెంకట్ రావును విగ్రహాల మహిమలు తెలిపే నిపుణుడిగా అవతారం ఎత్తించాడు. ఆ క్రమంలో ఈ ముఠాకి మహిమ విగ్రహాల పిచ్చి కలిగిన నెల్లిమర్ల కి చెందిన కాళ్ళ మహేష్ అనే వ్యక్తి తారస పడ్డాడు. దీంతో ఆయన్ని ఎలాగో బురిడీ కొట్టించి మహిమ గల దేవతా విగ్రహం తమ ఉందని నమ్మించారు. మహేష్ వారి మాయ మాటలు నమ్మి దేవతా విగ్రహంను రూ. 5 లక్షలు ఖరీదుకి కొనేందుకు సిద్ధపడ్డాడు.
ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఏడాది మే నెల 27న రూ. 20 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించాడు. ఇక అటు తర్వాత మిగిలిన మొత్తం సొమ్మును సిద్ధం చేసుకుంటే విగ్రహం ఇస్తామని నమ్మించారు. ఆ క్రమంలో ఈ నెల 10న కాళ్ళ మహేష్ కి వీరు ఫోన్ చేసి రమ్మని చెప్పి, అతడికి దేవతా విగ్రహం బదులు సిపాయి విగ్రహం అప్ప చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందుకు అంగీకరించని మహేష్, తనకు మహిమ గల దేవతా విగ్రహమే కావాలని తెగేసి చెప్పి, తనను రాజనాల ముఠా మోసం చేస్తోందని భావించి పోలీసులకి పిర్యాదు చేసాడు.
బాధితుడి మహేష్ పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసిన విజయనగరం రూరల్ పోలీసులు రెండు బృందాలుగా నిఘా పెట్టి విగ్రహంతో పాటు నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు. మరొక ముద్దాయి పరారీలో ఉన్నాడు. వారిపైన సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను గురువారం డిఎస్పీ అనిల్ పులిపాటి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకి వివరించారు.