మాస్కులు లేకుండా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తాం: కృష్ణా జిల్లా ఎస్పీ
గురువారం, 11 జూన్ 2020 (19:52 IST)
కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా మరో రెండు మూడు నెలలు అప్పమత్తత తప్పదని, కరోనా కట్టడికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో బందరు, గుడివాడ, అవనిగడ్డ సబ్-డివిజన్ క్రైం మీటింగ్‌కి 3 సబ్ - డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ.. "గడచిన 2 నెలల కాలం నుంచి కోవిడ్-19 విధుల్లో జిల్లా యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది.
కారోనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉంది. మరో 2, 3 నెలలు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు లేకుండా బయటికి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇందు కోసం ప్రత్యేకంగా జిల్లాలో ప్రతి రోజు మాస్క్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నాం.
ఇకపై మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చిన షాపుల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడినా వారిపై చలానా విధిస్తాం. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూనే వారు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు జిల్లా ఎస్పీ పరిధిలో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ సంఖ్య ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో తక్కువే. అయినప్పటికీ రాబోవు రోజుల్లో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా జిల్లాలో పట్టణ ప్రాంతాల్లోనే నమోదైన పాజిటివ్ కేసులు, తాజాగా ఇప్పుడు గ్రామాలకు సైతం విస్తరించింది.
ఈ నేపద్యంలో ఘంటసాల మండలం ఒక గ్రామంలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామీణ పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ, కేసులు నమోదు అయిన ప్రాంతాలలో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను వెంటనే గుర్తించాలి. ఇప్పటికే జిల్లాలో నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం ప్రాంతాలలో ట్రూ నాట్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. పాజిటివ్ కేసులు నమోదైన ఇంటికి చుట్టుపక్కల ఉన్న నాలుగైదు ఇళ్లను కంటోన్మెంట్ చేసుకుని, వారికి కోవిడ్-19 జాగ్రత్తల వివరించాలి. పాజిటివ్ కేసులు వచ్చిన పిల్లలను పూర్తి ఐసోలేషన్‌లో ఉంచాలి.
10 సంవత్సరాల లోపు పిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు బయటికి రాకుండా చూడాలి, వస్తే వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించాలి. మాస్కులు లేకుండా బయట ఎక్కడ కనిపించినా వారికి అక్కడే కౌన్సిలింగ్ నిర్వహించి మాస్కులు ధరించేలా చేయ్యలి. రాబోవు రోజుల్లో విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చి, ఎన్ ఫోర్స్ మెంట్ విధులు మరింతగా పెంచనున్నాం.
జిల్లాలో పని చేసే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కోవిడ్-19 నుంచి రక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలి. సెక్రటేరియట్, హైకోర్టు, సీఎం బందోబస్తు, ఇతర బందోబస్తు విధులకు వెళ్ళే సిబ్బంది పూర్తి రక్షణ కవచాలు ధరించాలి. జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ ను ప్రతిరోజు శానిటైజ్, బ్లీచింగ్ చేస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలి.
పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు ఇతర కారణాల మీద వచ్చే వారితో మాట్లాడడానికి సిబ్బంది మాస్కులు,గ్లోజులు, ఫేస్ కవర్లు తప్పక ధరించాలి. కుటుంబరక్షణను దృష్టిలో ఉంచుకుని, విధులు ముగించుకుని బయట బందోబస్తుకు వెళ్లే సిబ్బంది మరల తిరిగి తమ ఇళ్లకు చేరే ముందు ఒకసారి చేతులను శానిటైజ్ చేసుకొని ఇళ్లకు వెళ్ళాలి.
ప్రతి పోలీస్ స్టేషన్లో వయస్సు తక్కువ ఉన్న సిబ్బందిని పెట్టి, ఎక్కువ వయస్సు గల సిబ్బందిని చిన్న చిన్న విధుల్లో కేటాయించాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో సోపులు, మాస్కులు, హ్యాండ్ వాష్ లు అందుబాటులో ఉంచాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో పీపీఈ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలి.
జిల్లాలో పని చేసే ఏ పోలీసు అధికారికి సిబ్బందికి కరోనా వైరస్ రాకుండా పూర్తి జాగ్రత్త చర్యలు పాటించాలి. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరం మేరకు పోలీస్స్టేషన్లలో మూడు షిప్టుల్లో డ్యూటీలు ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం నియంత్రణకై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇందుకోసం ఎస్ఈబి విభాగం ఏర్పాటు చేశామని" ఎస్పీ వివరించారు.