విజయవాడలో రూ. 5 కోట్లతో ఇన్‌డోర్ సబ్ స్టేషన్ : మంత్రి వెలంపల్లి
గురువారం, 5 నవంబరు 2020 (07:57 IST)
రైతులకు అత్యంత ప్రయోజనదాయకమైన వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పధకంపై రైతులందరికీ సమగ్ర అవగాహన కల్పించాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అధికారులకు సూచించారు.
విజయవాడ మంత్రి కార్యాలయంలో ఎపిసీపిడిసిఎల్ చైర్మన్ పద్మజనార్ధనరెడ్డి, డి.ఈ. బివి సుధకర్, ఏఈ బాలాజీ, ఏఈలతో మంత్రి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పోస్టర్ మంత్రి అవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 11లక్షల మంది, కృష్ణజిల్లా లక్ష 10వేల మంది రైతులు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు పధకం ద్వారా లబ్ది పొందనున్నారన్నారు. వీరందరికి కేంద్ర, రాష్ట్ర విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతుల సమగ్ర అవగాహన సందేహాల నివృత్తి కల్పించేందుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు.
ఈ పధకం వల్ల ప్రభుత్వం నుండి ఎంత సహాయం అందుతున్నదీ విద్యుత్ కంపెనీ నుండి నాణ్యమైన విద్యుత్ సరఫరా, సేవలు అడిగే హక్కు రైతుకు వస్తుందన్నారు.
జిల్లా స్థాయి నుండి డివిజన్, మండల, గ్రామ స్థాయిలో రైతు అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
5 కోట్ల రూపాయలతో పశ్చిమలో ఇన్‌డోర్ సబ్ స్టేషన్
తర్వలో 5 కొట్ల రూపాయలతో ఇన్‌డోర్ సబ్ స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు. దుర్గమలేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్మించనున్న ఇన్‌డోర్ సబ్ స్టేషన్ ద్వారా అమ్మవారి దేవాలయానికి నాణ్యమైన, అతి తక్కువ ధరకు విద్యుత్ అందుతుందన్నారు.
ఇన్‌డోర్ సబ్ స్టేషన్ ప్రారంభమై 5 నెలల తరువాత నుంచి నియెజకవర్గంలో చాలా ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. సమావేశంలో ఎపిఈపిడిసిఎల్ చైర్మన్ పద్మజనార్థన రెడ్డి, డీఈ సుధాకర్, ఏఈ బాలాజీ, ఈఈ మరియు చాంబర్ అప్ కామర్స్ అధ్యక్షులు కోనకళ్లు విద్యాధరరావు, కొండపల్లి బుజ్జి తదితరులు ఉన్నారు.