శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తిరుమలలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సౌకర్యవంతంగా చేరుకునేందుకు వీలుగా ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయడంలో భాగంగా టిటిడిలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాలతో వార్షిక క్యాలెండర్ రూపొందించాలన్నారు. పిల్లలు చదువుకునేందుకు వీలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల భజన మందిరాల్లో భక్తి, ఆధ్యాత్మిక పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
తిరుమల, తిరుపతితోపాటు అన్ని ప్రాంతాల్లో టిటిడి డైరీలు, క్యాలెండర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని జెఈవోను కోరారు. టిటిడికి సంబంధించిన భూముల అంశాలను ఎస్టేట్ కమిటీలో చర్చించాలని ఎస్టేట్ అధికారిని ఆదేశించారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ ప్రాకారానికి విద్యుత్ అలంకరణ పనులు చేపట్టేందుకు నైపుణ్యం గల సంస్థను ఆహ్వానించాలని, అక్కడి ఇంజినీరింగ్ పనులను త్వరలో పరిశీలిస్తానని అన్నారు.
ఎస్వీబీసీలో ప్రసారమవుతున్న సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమానికి భక్తుల నుండి ఆదరణ లభిస్తోందని, దీన్ని యూట్యూబ్‌లోనూ ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం కల్పించాలని ఈవో కోరారు. టిటిడి ఆధీనంలోకి తీసుకున్న ఆలయాల పరిసరాల్లో సౌర ఫలకాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.
తిరుమల, తిరుపతిలోని వివిధ కాటేజీలు, విశ్రాంతి గృహాల్లో ఉన్న ఎసిలపై ఆడిట్ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆలయాలు, విశ్రాంతి గృహాల్లో ఎల్ఇడి బల్పులు వినియోగిస్తున్న కారణంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు వీలుగా తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లలో తగినన్ని కంప్యూటర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్, ఎఫ్ఏసిఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ రామచంద్రారెడ్డి, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.