తిరుమలలో అన్యమత ప్రచారంపై విచారణ జరుగుతోందని దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... "తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారంటూ జరుగుతున్న వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించాం.
ఆ టిక్కెట్లు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలింది. ఎన్నికలకుముందు ఆ టెండర్లను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టుగా వెల్లడవుతోంది. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లు నిబంధనలకు విరుద్దంగా తిరుపతి డిపోకు వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయడమే కాదు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం, దానికి సంబంధించిన వ్యక్తులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కొన్ని టీవీ ఛానళ్లు, వ్యక్తులు కూడా ఈ వ్యవహారాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారు.
నిబంధనలను ఉల్లంఘిస్తూ దురుద్దేశ పూర్వక ప్రచారం ద్వారా శ్రీవారి భక్తుల మనస్సులను గాయపరిచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలకు పాల్పడుతున్నారు. విషప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. తిరుమల ప్రతిష్టనూ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే వారిపై చట్టప్రకారం నడుచుకుంటాం.
40 దేవాలయాలను కూలగొట్టించినది, సదావర్తి భూములు కాజేసినది, కనకదుర్గమ్మ గుడిలో, కాళహస్తిలో క్షుద్ర పూజలు చేయించినది, అమ్మవారి భూముల్ని తనవారికి లీజులు ఇచ్చినది గత తెలుగుదేశం ప్రభుత్వమే. హిందుత్వం మీద చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా?
తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు కలియుగ దైవానికి సంబంధించిన బంగారాన్ని లారీల్లో తరలించటం వరకు అన్ని దుర్మార్గాలూ చేశారు కాబట్టే ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురయ్యారు. అయినా బుద్ది, జ్ఞానం రాలేదని అందరికీ అర్థమవుతోంది. చివరికి పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నారు.
ఈ దుర్మార్గాలన్నీ చేసిన సమయంలో దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్నది మాణిక్యాల రావు. ఆయన కూడా ఇవే మాట్లాడుతున్నాడు. మతాలన్నీ అక్కున చేర్చుకున్నందువల్లే జగన్ గారు అందరి మనిషి అయ్యారు. మతాలన్నీ ఛీకొట్టబట్టే చంద్రబాబు అందరికీ దూరమయ్యారు" అని మండిపడ్డారు.