"నిజం" సినిమా చేస్తే నా కెరీర్ దెబ్బతింటుందని భావించానని, ఆ చిత్రం విడుదలయ్యాక నేను ఊహించినట్టుగానే జరిగిందని సినీ నటి రాశి చెప్పుకొచ్చారు. 1990లో తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగారు. బాలనటిగా అనేక చిత్రాల్లో నటించిన రాశి.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ముఖ్యంగా, 'శుభాకాంక్షలు', 'గోకులంలో సీత', 'స్నేహితులు' వంటి చిత్రాలతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.
''నిజం' సినిమా కోసం నన్ను తేజ ఆఫీసుకి పిలిపించి మాట్లాడారు. ఆయన నా పాత్ర గురించి చెప్పారు. నేను కాస్త బరువు తగ్గాలని చెప్పి ట్రైనర్‌ని కూడా పెట్టారు. మేకప్ లేకుండా నేను ఆ సినిమాను చేశాను. చేయకూడని సీన్‌ను ఫస్ట్ రోజునే షూట్ చేశారు. ఈ సీని గురించి నాకు ముందుగా చెప్పలేదు. అందుకే తొలుత చేయనని చెప్పాను.బాబురావు నచ్చజెప్పడంతో అయిష్టంగానే చేశాను. ఆ తర్వాత తేజ సారీ చెప్పినా నేను దానిని అంగీకరించనని అన్నాను' అని చెప్పారు.
'పైగా, ఆ పాత్ర చేస్తే నా ఇమేజ్ దెబ్బతింటుందని నాకు అనిపించింది. నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారని అనిపించింది. నేను అనుకున్నట్టుగానే జరిగింది. ఆ సినిమా తర్వాత నా కెరీర్ పోయింది. మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో ఒకరు అడిగారు. ఇండస్ట్రీలో ఏ దర్శకుడినైనా మరిచిపోవాలని అనుకుంటే ఏ డైరెక్టర్‌ని మరిచిపోతారు అని. అపుడు వాళ్ళకి నేను తేజ పేరు చెప్పాను. ఆ సినిమా తర్వాత తేజ సినిమాలకి నేను పని చేశాను. కాకపోతే ఆ సినిమా విషయంలో ఇలా జరిగిందనే మాత్రం 'నిజం' అని అన్నారు.