హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి పెద్ద షాక్ తగలనుందా? సొంత పార్టీలోనే కాదు... కుటుంబంలోనూ లుకలకలు రానున్నాయా? గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొత్త పార్టీ పెడతాడని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆ పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నారట.
తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ, బావ సీఎం చంద్రబాబుతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్న నందమూరి హరికృష్ణ మరోసారి చక్రం తిప్పనున్నారని చెపుతున్నారు. కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో కీలక భూమిక వహించబోతున్నారట. ఎన్టీఆర్ పార్టీ గురించి రూమర్సే తప్ప అధికారికంగా ఎలాంటి సమాచారం ఇంతవరకు లేదు.
కానీ, ఎన్టీఆర్‌తో ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెపుతున్నారు. ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హఠాత్పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య అధికారం ఢీ అంటే ఢీ అనే పోరు నడుస్తోంది. మరో పక్క పవన్ కల్యాణ్ జనసేన అంటూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. ఈ తరుణంలో ఒకడుగు ముందుకేసి జూనియర్ సొంత పార్టీ పెడితే, అబ్బో ఏపీ రాజకీయం ఉడుకెత్తిపోదూ!