ఏపీలోని విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్ మూలాలు వెలుగు చూశాయి. విజయనగరం ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా ప్రధాన నిందితుడిని అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ అని ఎన్.ఐ.ఏ పేర్కొంది. దేశం నుంచి తప్పించుకునే క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఆరిఫ్‌ను ఎన్.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితుడుని విశాఖపట్టణంకు తీసుకొచ్చి ఎన్.ఐ.ఏ. ప్రత్యేక కోర్టులో హజరుపరుచనున్నారు.
కాగా, విజయనగరం ఐసిస్ ఉగ్ర కేసులో అరెస్టయిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ సయ్యద్ సమీర్‌లతో ఆరిఫ్‌కు సంబంధాలు ఉన్నట్టు ఎన్.ఐ.ఏ దర్యాప్తులో తేలింది. సిరాజ్, సమీర్‌ల వద్ద ఐఈడీఎస్ తయారీకి అవసరమైన రసాయనాలు ఉన్నట్టు ఎన్.ఐ.ఏ గుర్తించింది. వీరు ఉగ్రదాడులకు వ్యూహం పన్నినట్టు ఎన్.ఐ.ఏకి ఆధారాలు లభించాయి. దేశ వ్యాప్తంగా జిహాదీ కార్యకలాపాల కోసం ఆర్ఫి అక్రమ ఆయుధాలను సరఫరా చేసినట్టు ఎన్.ఐ.ఏ అధికారులు గుర్తించారు.