ఈ పిటిషన్లను కొట్టేయాలంటూ సీబీఐ హైదరాబాద్ విభాగం ఎస్పీ పీసీ కల్యాణ్.. 17 పేజీల కౌంటర్ అఫివిడవిట్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని.. అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోరడం సరికాదని సీబీఐ స్పష్టం చేసింది.
హాజరు మినహాయింపు ఏ నిందితుడికీ హక్కు కాదని, అది న్యాయస్థానం విచక్షణాధికారమని పేర్కొంది. నిందితుడి హోదా, ఆర్థిక స్తోమత కోర్టుపై ప్రభావం చూపలేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని తెలిపింది.
సీఎం హోదా ఉందన్న కారణంగా మినహాయింపు ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తీవ్రమైన ఆర్థిక నేరం కాబట్టి మినహాయింపు ఇవ్వలేమని 2014 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 2016లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇదే అభ్యర్థనతో మరోసారి పిటిషన్లు దాఖలు చేయగా వాటినీ అదే కోర్టు కొట్టివేసింది.