పెగాసస్ స్పైవేర్‌ను ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే అమ్మామని భారత్‌లో ఇజ్రా యిల్ రాయబారి నాయోర్ గిలిన్స్ వెల్లడించారు. ఇజ్రాయెల్ సంస్థ తయారుచేసిన మిలటరీ గ్రేడ్ స్పైవేర్ 'పెగాసస్'ను మోడీ సర్కార్ కొనుగోలు చేసిందనే సంగతి నాయోర్ గిలిన్స్ చెప్పకనే చెప్పారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయవా దులు, హక్కుల కార్యకర్తలపై అక్రమ నిఘా కార్యాకలాపాల కోసం పెగాసస్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన సాంకేతిక సేవల సంస్థ 'ఎన్‌ఎస్‌ఓ' నుంచి భారత్ కొనుగోలు చేసిందని ఆరోపణలున్నాయి.
ఈ సందర్భంగా ఆయన వార్తా ఏజెన్సీ 'పీటీఐ'తో మాట్లాడుతూ..''పెగాసస్‌ను తయారుచేసిన ఎన్‌ఎస్‌ఓ ఇజ్రాయెల్‌లో ఒక ప్రయివేటు కంపెనీ. ఆ సంస్థ తయారుచేసిన ప్రతి ఉత్పత్తికి ఇజ్రాయెల్ ఎక్స్‌పోర్ట్ లైసెన్స్ అవసరం. ఆ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్మాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది'' అని చెప్పారు. పెగాసస్ కుంభకోణంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన రెండు రోజుల్లోనే ఇలాంటి వార్త బయటకు రావటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో జరుగుతున్న దర్యాప్తుపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అది భారత్ అంతర్గత విషయంగా పేర్కొన్నారు.
నాయెర్ గిలిన్స్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం మాట్లాడుతూ, పెగాసస్‌ను ప్రభుత్వాలు మాత్రమే కొనుగోలు చేస్తాయన్నది తేలిపోయింది. మరి ఇక్కడ కొనుగోలు చేసింది మోడీ సర్కారేనా? కాదా? అన్నది బయటకురావాలి. దీనిపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రి స్పందించాలని చిదంబరం డిమాండ్ చేశారు.