పెగాసెస్ స్పైవేర్ వ్యవహారంపై దర్యాప్తుకు ఎక్స్‌పర్ట్ కమిటీ : సుప్రీంకు కేంద్రం

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:50 IST)
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై విచారణకు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. 
 
పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న పిటిషన్లపై ప్రధాన నాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే, పెగాసస్​పై తాము ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా మరో ప్రమాణపత్రం సమర్పించలేమని తెలిపింది. 
 
కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా… దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా చెప్పారు. అయితే పెగాసస్‌ అంశం అత్యంత ముఖ్యమైనదేని తెలిపారు. కేంద్ర ఏర్పాటు కమిటీ అన్నీ పరిశీలించి కోర్టుకు నివేదిస్తుందన్నారు. 
 
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశభద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. పౌరుల గోప్యతకు సంబంధించిన విషయం, గోప్యత భంగంపై పిటిషన్లు వచ్చాయని వీటిపైనే విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు