అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదు.. వైసీపీ ప్రచార బడ్జెట్ : జేడీ లక్ష్మీనారాయణ

ఠాగూర్

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (12:18 IST)
ఏపీ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జై భారత్ పార్టీ అధినేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదని వైకాపా ఎన్నికల ప్రచార బడ్జెట్ అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్ ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించినట్టుగా అంత అభివృద్ధి జరిగితే తెల్ల రేషన్ కార్డుల సంఖ్య ఎందుకు తగ్గడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 
యువత ఉపాధి కోసం ఎందుకు వలస పోతున్నారని, రోడ్లు ఎందుకు వేయడం లేదని మండిపడ్డారు. అప్పులు చేసి డబ్బులు పంచిపెడితే పేదరిక నిర్మూలన ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. రూ.4.25 లక్షల కోట్ల నగదు బదిలీతో పేదరికం తొలగించామంటూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటన చేసి ఆత్మవంచనతో సమానమన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాస్తవం ఎంత అని అడిగారు. 
 
43 లక్షల మంది విద్యార్థులకు గోరుముద్ద, 35 లక్షల మంది పిల్లలకు సంపూర్ణ పోషణ అని లెక్కలు చెప్పారని, ఇవి ఎంతవరకు నిజమని మండిపడ్డారు. అలాగే, బుధవారం రిలీజ్ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై కూడా ఆయన స్పందిస్తూ, ఎన్నికల ముందు హడావుడిగా టీచర్ పోస్టుల భర్తీ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు