పవన్ చెంతవుంటే నంబర్ 1.. వైకాపాలోకి వెళ్తే 152.. జనసేన ఎమ్మెల్యే

బుధవారం, 5 జూన్ 2019 (18:10 IST)
ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిపై గెలుపొందారు. అయితే, ఈయన పార్టీ మారబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిపై జనసేన ఎమ్మెల్యే రాపాక స్పందించారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదన్నారు. పైగా, పైపెచ్చు జనసేన పార్టీ తరపున ఏకైక ఎమ్మెల్యేలను తానేనని, అందువల్ల తాను వెళ్లి మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు.
 
ముఖ్యంగా, తాను పవన్ చెంత ఉంటే జనసేన పార్టీలో నంబర్ వన్ ఎమ్మెల్యేను. అదే సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలోకి వెళితే 152వ ఎమ్మెల్యేను అంటూ చమత్కరించారు. ఎవరైన నంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకుంటారేగానీ చిట్ట చివరి స్థానంలో ఉండాలని ఆశపడరన్నారు. 
 
అదేసమయంలో మున్ముందు జనసేనకు దివ్యమైన భవిష్యత్తు ఉందని, పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రజల కోసం పోరాటం చేస్తారని రాపాక తెలిపారు. కాగా, తనను బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారని, కానీ తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. ఇటు వైసీపీలోకి కూడా వెళ్లనని, జనసేనలో ఉంటానని తేల్చి చెప్పారు. 
 
కాగా, ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైకాపా 151 సీట్లు గెలుపొందగా, టీడీపీకి 23, జనసేన పార్టీకి ఒక సీటు వచ్చిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు