ఏపీ అసెంబ్లీ సమరం : బాపట్లలో ముగ్గురు జనసేన అభ్యర్థులు..

మంగళవారం, 26 మార్చి 2019 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. ప్రధానంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఈనెల 28వ తేదీన పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. 
 
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నరు. ఈ నియోజకవర్గంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయమై కార్యకర్తలు తికమక పడుతున్నారు.
 
ఈ స్థానంలో తొలుత పార్టీ నుంచి బీ-ఫారం అందుకున్న రైల్వే కాంట్రాక్టర్ పులుగు మధుసూదన్‌ రెడ్డి తొలుత నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ మాజీ జేడీ వివి. లక్ష్మీనారాయణ సన్నిహితుడు ఇక్కుర్తి లక్ష్మీనరసింహకు టికెట్ ఇచ్చి మధుసూదన్‌రెడ్డి బీ-ఫారంను జనసేన రద్దు చేసింది. దీంతో సోమవారం లక్ష్మీనరసింహ నామినేషన్ వేశారు.
 
అయితే, పార్టీ నుంచి బీ-ఫారం లేకపోయినప్పటికీ తానే అభ్యర్థినంటూ ఆ పార్టీకి చెందిన మరో నేత బీకే నాయుడు కూడా ఇక్కడి నుంచి నామినేషన్ వేశారు. ఇలా ఒకే పార్టీకి చెందిన ముగ్గురు నేతలు బరిలో ఉండటంతో జనసేన శ్రేణులు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు