అమ్మో.. బిజెపి? హడలిపోతున్న జనసైనికులు!

శనివారం, 6 మార్చి 2021 (11:00 IST)
ఎపి మున్సిపల్‌ ఎన్నికల్లో బిజెపి-జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జనసేన అభ్యర్థులకు, కార్యకర్తలకు ఎన్నికల ప్రచారం తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. బిజెపి కండువా వేసుకొని జనసైనికులు ప్రచారంలో పాల్గొనడమే అందుకు కారణమని సమాచారం.
 
ఎన్నికల్లో ఏవైనా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. ప్రచారంలో ఆ రెండు పార్టీల నాయకులు రెండు పార్టీల కండువాలు మెడలో వేసుకొని అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తారు. అలాగే ఎపిలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పలు చోట్ల బిజెపి-జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.

ఆయా పార్టీల అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లో రెండు పార్టీల నాయకులు బిజెపి, జనసేన కండువాలు వేసుకొని ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇదే జనసైనికులకు తలనొప్పిగా మారిందని చెప్పుకుంటున్నారు. మెడలో జనసేన కండువాతో పాటు బిజెపి కండువా కూడా వేసుకొని ప్రచారానికి వెళ్తున్న జనసైనికులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నట్లు సమాచారం.

మెడలో బిజెపి కండువా తీసేసి రావాలని ప్రజలు మొహం మీదే చెబుతున్నారట. దీనికి కారణం లేకపోలేదు. రాజధాని అమరావతి విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ధ్వంధ్వ వైఖరి.. ఎపికి ప్రత్యేక హోదాపై ఎటూ తేల్చకపోవడం.. తాజాగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణకు పూనుకోవడం.. వంటి అంశాలను గుర్తు చేస్తూ జనసైనికులను కడిగి పారేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి సమస్య ముఖ్యంగా విజయవాడ పశ్చిమ, తూర్పు, సెంట్రల్‌ నియోజకవర్గాలతో పాటు గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో జనసైనికులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ సమస్యను జనసైనికులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వివరించినట్లు తెలుస్తోంది.

ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమధానం చెప్పలేక.. బిజెపితో కలిసి ప్రచారానికి వెళ్తే మొదటికే మోసం వస్తుందేమోననే భయంతో బిజెపి కండువా తీసేసి జనసేన కండువాతో మాత్రమే ప్రచారానికి వెళ్తున్నట్లు చెప్పారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు