అమరావతి : రాష్ట్రంలోని అక్రెడిటెడ్ జర్నలిస్టుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న జర్నలిస్టుల గృహనిర్మాణ పథకంలో 1200 అడుగుల విస్తీర్ణంతో మూడు పడక గదుల ఇంటిని కూడా నిర్మించి ఇచ్చే వెసులుబాటును కల్పిస్తూ మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ మేరకు కమిటీలో సభ్యులు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణతో సోమవారం చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
పన్నెండు వందల అడుగుల విస్తీర్ణంతో మూడు పడకగదుల ఇళ్ల నిర్మాణాన్ని సి.ఆర్.డి.ఏ. పరిధిలో ఇప్పటికే చేపట్టారని, ఆ ఇళ్ల ఆకృతుల తరహాలోనే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జర్నలిస్టులకు నిర్మించి ఇవ్వనున్నట్టు మునిసిపల్ మంత్రి తెలిపారు. ఈ ఇళ్లను సిఆర్‌డిఏ ఆధ్వర్యంలో ఎంత ఖర్చుతో నిర్మిస్తున్నారో అదే ఖర్చుతో ఇక్కడ కూడా నిర్మిస్తారని చెప్పారు. ఇప్పటికే అందుబాటులో వుంచిన మేరకు 720 అడుగుల విస్తీర్ణంతో నిర్మించే ఇళ్లను డబుల్ బెడ్రూం ఇళ్లుగా నిర్మించడం జరుగుతుందని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు.
వీటితోపాటు 360, 430 అడుగుల విస్తీర్ణంతో కూడా ఇళ్లను కూడా అందుబాటులో వుంచడం జరిగిందన్నారు. ఏహెచ్‌పి(ఎఫర్డబుల్ హౌసింగ్ ప్రొగ్రాం)లో ఇళ్లను నిర్మించుకొనేందుకు ముందుకువచ్చే జర్నలిస్టులకు పై నాలుగు విభాగాల్లో ఏదైనా ఒక విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకొనే వెసులుబాటు ఏర్పడుతుందన్నారు. ఆన్ లైన్‌లో జర్నలిస్టులు దరఖాస్తు చేసుకొనేటపుడు 1200 అడుగుల్లో నిర్మించే ఇళ్లను కూడా ఎంపిక చేసుకోవచ్చన్నారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి, ఎం.ఎల్.సి. విష్ణువర్దన్, ఏ.పి. టిడ్కో చీఫ్ ఇంజనీర్ శ్రీమన్నారాయణ, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.