విజయవాడ నగరాన్ని బుడమేరు వరద నీరు ముంచెత్తిందని, అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో చిక్కుకుని ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా నిలబడి, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పైగా, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
వరద నీరు ముంచెత్తిన విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లో ఆయన పర్యటించి, అనేక మంది వరద బాధితులకు వివిధ రకాల సహాయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుడమేరును ఆక్రమించిన రాజకీయ నేతలు, బడా నేతలు భారీ భవంతులను నిర్మించడం వల్లే ఈ విపత్కర పరిస్థితులకు ప్రధాన కారణమన్నారు. అందువల్ల బుడమేరు ఆక్రమణలను తక్షణం తొలగిస్తేనే భవిష్యత్‌లో విజయవాడ నగరానికి జలగండం ఉండదన్నారు.
ఇపుడు సంభవించిన వరదల కారణంగా మునిగిపోయిన కాలనీలకు చెందిన ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం తన వంతు సాయం చేస్తానని తెలిపారు. పైగా, విజయ్ మాల్యా వంటి కోటీశ్వరులకు లక్ష కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇపుడు ఈ వరద బాధితులను ఆదుకునేందుకు కేవలం పది వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని ఆయన కోరారు.