ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా నవ యువ కెరటం కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్. ని నియమిస్తూ, ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కాంతి రాణా 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అనంతపురం డీఐజీ గా పని చేస్తున్న ఆయన్ని విజయవాడకు తీసుకువస్తున్నారు. అయితే, గతంలో విజయవాడ డిసిపిగా కాంతి రాణా పని చేసిన అనుభవం ఉంది.
ఎప్పుడూ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించే కాంతి రాణా, చాలా సమర్ధుడైన పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. బి.ఎ, ఎల్.ఎల్.బి చదివిన ఆయన విజయవాడలో డి.సి.పిగా పని చేసినపుడు, ప్రజలతో, ప్రజా సంఘాలతో, స్వచ్ఛంద సంస్థలతో ఎంతో సామరస్యంగా వ్యవహరించేవారు. విధి నిర్వహణలో చాలా ఖచ్చితంగా, నిబద్ధతగా ఉంటూనే, పేదలు, సామాన్యుల పట్ల ఎంతో గౌరవంగా దయతో నడుచుకునేవారు.
విజయవాడలో స్వచ్ఛంద సంస్థలతో కలసి ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1976, డిసెంబరు 21న పుట్టిన కింది స్థాయి నుంచి ఐ.పి.ఎస్. అధికారిగా కష్టపడి ఎదిగారు. ఆయన భార్య కూడా హైదరాబాదులో కస్టమ్స్ అధికారిణిగా ఉన్నారు. కాంతి రాణా టాటా నియామకానికి ముందు సీపీ బత్తిన శ్రీనివాసులు రిటైర్ కావడంతో, ఆయన స్థానంలో తాత్కాలిక సీ.పిగా పాలరాజును నియమించారు. ఇపుడు కాంతి రాణాను శాశ్వత పోస్టింగ్ ఇస్తూ, డి.జి.పి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.