ఫ్లెక్సీపై నా ఫోటో ఎందుకు వేయలేదు.. సిబ్బందిపై వైకాపా ఎమ్మెల్యే తిట్ల దండకం

గురువారం, 11 మే 2023 (09:02 IST)
ఏపీలో అధికార వైకాపా ఎమ్మెల్యేలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను దుర్భాషలాడుతున్నారు. వారిపై బూతు పురాణం చదువుతున్నారు. పై స్థాయి అధికారులు ఆదేశాల మేరకు కింది స్థాయి అధికారులు నడుచుకుంటున్నారు. అయితే, ఇవేమీ పట్టనట్టుగా వారు చిరుద్యోగులపై రెచ్చిపోతున్నారు. 
 
తాజాగా మచిలీపట్నం జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు వంతు వచ్చింది. గ్రంథాలయ ఉద్యోగులను దుర్భాషలాడారు. గ్రంథాలయాల్లో విద్యార్థులకు ప్రభుత్వం వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తన ఫొటోలేదని ఎమ్మెల్యేకు తెలిసింది. 
 
సదరు గ్రంథాలయ మహిళా అధికారిణిని ఎమ్మెల్యే నాగేశ్వర రావు మంగళవారం తన కార్యాలయానికి పిలిపించి, ఫ్లెక్సీపై తన ఫొటో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఆ ఫ్లెక్సీలు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి వచ్చాయంటూ ఆమె సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే. 'ఎవడాడు... మీపై అధికారి ఫోన్ నంబర్ ఇవ్వు..' అంటూ రగిలిపోయారు. 
 
మచిలీపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థలో పనిచేసే యూడీసీకి ఫోన్ చేసి తిట్ల దండకం అందుకున్నారు. ప్లెక్సీపై స్థానిక ఎమ్మెల్యే ఫొటో ఉండనవసరం లేదా.. అంటూ దూషించారు. కార్యదర్శిపై సైతం ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోయారు. చివరకు ఎమ్మెల్యే, ఎంపీపీ ఫొటోలతో కొత్త ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో ఆయన శాంతించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు