రాహుల్ గాంధీని ప్ర‌ధానిని చేయాలని సోనియా రాష్ట్రాన్ని విడగొట్టారు : కావూరి విమ‌ర్శ‌

బుధవారం, 14 సెప్టెంబరు 2016 (12:37 IST)
విజ‌య‌వాడ‌: ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయి.. రాజకీయ నాయకులు అంటే దొంగలు అనే పరిస్థితులు వచ్చాయి... స్వార్థం కోసం కాకుండా, ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే నాయకులు చాల తక్కువమంది ఉన్నార‌ని బీజేపీ నేత‌, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. అవినీతి అరికట్టడానికి మోడీ కృతనిశ్చయంతో పనిచేస్తున్నార‌ని, ఒక‌రు వేలెత్తి చూపించే అవకాశం లేకుండా మోడీ కాబినెట్ ఉంద‌న్నారు. 
 
కావూరి మీడియాతో మాట్లాడుతూ, మోడీ త‌ర‌హాలోనే రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థం లేకుండా పని చెయ్యాల‌న్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరగకుండా ఆపాలి కాని అభివృద్ధిని అడ్డుకోకూడద‌ని, అవినీతి జరుగుతుందని ప్రాజెక్టులు ఆపేయ్యాలా? అని ప్ర‌శ్నించారు. కొడుకుని ప్రధానిని చెయ్యడం కోసం సోనియా గాంధీ ఏపీకి అన్యాయం చేశార‌ని, విభజనకి వ్యతిరేకంగానే కాంగ్రెస్ నుండి తాను బయటకి వచ్చానన్నారు. 
 
ఏపీ అభివృద్ధి కోసం సహాయం చెయ్యాల్సిన బాధ్య‌త‌ కేంద్రం పైన ఉంద‌ని, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కేవలం అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయ‌ని, ప్రజల కోసం కాకుండా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. హోదా అంశాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ-టీడీపీ సఖ్యతని నాశనం చెయ్యాలని చూస్తున్నార‌ని కావూరి విమ‌ర్శించారు.

వెబ్దునియా పై చదవండి