ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామసచివాలయ వ్యవస్థ అమలవుతుంది. ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకు చేర్చాలన్న ఏకైక లక్ష్యంతో ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇపుడు ఈ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారుపై ఆయా జిల్లాల కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు.
ప్రత్యేకించి పేదల గృహాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన ఏకకాల పరిష్కారం (ఓటీఎస్) కోసం వసూలు చేసి జమ చేయని కోట్లాది రూపాయలపై ఆరా తీస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లాలకు వెళ్లిన సమాచారం ఆధారంగా కలెక్టర్లు ఆ ఉద్యోగులతో లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి జమ చేయని ఉద్యోగుల ప్రొబేషన్ నిలిపివేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.
సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ను నెలాఖరులోగా ఖరారు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల సర్వీసు పూర్తవ్వని, పూర్తయినా శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వని ఉద్యోగులను ప్రొబేషన్‌కు ఎలాగూ దూరంగా పెట్టనున్నారు. ఓటీఎస్ బకాయిలపైనా లెక్కలు తేల్చని ఉద్యోగులను పక్కన పెట్టి మిగిలిన వారికి ప్రొబేషన్‌ను ఖరారు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటీఎస్ వ్యవహారాన్ని మెడపై కత్తిలా వేలాడదీయడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.