ఈ నియోజకవర్గంలోని ఆత్మకూర్ మండలి ఆగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర నూతన పాలకవర్గం ఇటీవల సమావేశమైంది. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని కూల్చివేయాలని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, తెరాస శ్రేణులు స్థూపాన్ని ధ్వంసం చేయడం జరిగిపోయింది. ఈ విషయం తెలిసిన కొండా దంపతులు తెరాస శ్రేణులను అడ్డుకున్నారు. ఫలితంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ పరిణామాలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కొండా సురేఖ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మారెడ్డి ఈ స్మారక స్థూపాన్ని తొలగించాలని చూస్తున్నారని, ఈ రోజు మరింతగా బరితెగించారని ఆరోపించారు.
గతంలో ఉన్న కలెక్టర్ కరుణను కూడా తప్పుదారి పట్టించారని సురేఖ అన్నారు. ఆమె విచారణ జరిపి స్మారక స్థూపం ఉన్న స్థలాన్ని ప్రైవేటు స్థలంగా మార్చారని చెప్పారు. ధర్మారెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, రోజులు దగ్గరపడ్డాయని ఆమె జోస్యం చెప్పారు.