మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామ సమీపంలోని కొత్త కాలనీకి చెందిన వెంకమ్మ మే 19వ తేదీన మద్యం తాగిన మత్తులో తూలుతూ గ్రామంలో కలియతిరిగింది. ఆ సమయంలో మరో మహిళ తనకు దేవత పూనిందంటూ ఊగిపోయింది.
వెంకమ్మకు దెయ్యం పట్టిందని తెలిపింది. దెయ్యాన్ని వదిలించాలంటే ఆమె చేతుల్లో నిప్పులు పొయ్యాలని ఆదేశించింది. అంతే.. ఆమె ఆదేశాలను ఇద్దరు యువకులు అమలు పరిచారు. ఆమె చేతులను బలంగా పట్టుకుని ఆ చేతుల్లో నిప్పులు ఉంచారు. దీంతో ఆమె తీవ్రంగా కాలిపోయింది. ఆమె ఆర్తనాదాలు చేస్తున్నా వినిపించుకోలేదు. రెండు చేతులు తీవ్రంగా కాలిన తరువాత విడిచిపెట్టారు.