అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా పథకం అమలు : కలెక్టర్ ఇంతియాజ్
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:40 IST)
కృష్ణా జిల్లాలో పేదవారికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న వై.యస్.ఆర్. బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరికీ లబ్ధి చేకూరేలా అధికారులు, బ్యాంకర్స్ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్
అన్నారు.
నగరంలోని కలెక్టరు క్యాంపు కార్యాలయంలో వై.యస్.ఆర్. బీమా పధకం అమలుపై క్షేత్రాధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ.... జిల్లాలో అర్హతగలవారందరికీ వై.యస్.ఆర్. బీమా పథకాన్ని అమలు చేయాలని, దీనిలో భాగంగా ఏప్రిల్ 16 నుండి మే 20 వరకూ జరిగే లబ్దిదారులు నమోదు కార్యక్రమంలో అర్హతగల ప్రతీ ఒక్కరినీ ఈ పథకంలో చేర్చాలని కలెక్టరు అన్నారు.
జిల్లాలో 4,80,487 మందిని వై.యస్.ఆర్. బీమా పథకంలో ఇప్పటికే ఉన్నారని, 4,24,149 మందికి భీమా పధకంలో నమోదు చేయబడి బ్యాంకుల నుండి ప్రీమియం చెల్లించలేదని వీరికి కూడా ఆయా బ్యాంకుల ద్వారా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇంకనూ రైస్ కార్డు హోల్డర్స్ మరో 1,30,741 మంది క్రొత్తవారు ఉన్నారని, వారిని కూడా ఈపధకంలో నమోదు చేయవలసి ఉందని కలెక్టరు అన్నారు.
వై.యస్.ఆర్. బీమా పథకం అమలుకు సంబంధించి గతంలో అన్ని బ్యాంకులు ద్వారా ప్రీమియం చెల్లించేవారని, ఈసారి జిల్లాలో 10 బ్యాంకులను ఎంపిక చేసి ఆబ్యాంకు శాఖల ద్వారా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టరు అన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఈదిశగా ఆయా బ్యాంకు శాఖలు పనిచేయాలని కలెక్టరు అన్నారు.
ప్రతీ బ్యాంకు శాఖ రోజుకు 50 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టరు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసేలా ముగ్గురు అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించామని, గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం అమలుకు సంబంధించి పిడి డిఆర్ డివి శ్రీనివాసరావు, పట్టణప్రాంతాలలో పిడి మెప్మా ప్రకాశరావు, విజయవాడ నగర పరిధిలో పిఓ యుసిడి అరుణ పర్యవేక్షణాధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టరు చెప్పారు.
ఏప్రిల్ 16 నుండి వై.యస్.ఆర్. బీమా పథకానికి అర్హులైన లబ్దిదారులను గుర్తించి వై.యస్.ఆర్. భీమా పోర్టల్లో వాలంటీర్లు నమోదు చేస్తారని అనంతరం ఆధరఖాస్తులను బ్యాంకు శాఖలకు పంపించి ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టరు అన్నారు.
ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్. బీమా పథకం క్రింద అమల్లో ఉన్న లబ్ధిదారులను రెన్యువల్ చేయడం, క్రొత్తవారిని నమోదు చేయడం మొదలగు కార్యక్రమాలు మే 20వ తేదీ వరకూ నిర్వహిస్తారని, జూన్ 1వ తేదీ నుండి వై.యస్.ఆర్. బీమా పథకం అమలు చేస్తారని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు (సంక్షేమం) కె. మోహన్ కుమార్, పిడి డిఆర్ఏ శ్రీనివాసరావు, యల్దేయం రామ్మెహనరావు, పిడి మెప్మా ప్రకాశరావు, విజయవాడ నగరపాలక సంస్థ పిఓ యుసిడి అరుణ, బ్యాంకు కంట్రోలింగ్ ఆఫీసర్లు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.