సారీ అండీ.. మీకు వారసుడిని ఇవ్వలేను... వివాహిత ఆత్మహత్య

వరుణ్

సోమవారం, 3 జూన్ 2024 (09:35 IST)
తన భర్త కోరిక మేరకు వారసుడు (సంతానం) ఇవ్వలేని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మొదటి కాన్పులో ఆడబిడ్డే పుట్టింది. రెండో బిడ్డ కూడా ఆడబిడ్డేనని స్కానింగ్ తేలింది. దీంతో అబార్షన్ చేయించుకో అంటూ భర్త, అత్తింటివారి నుంచి వేధింపులు ఎక్కువైపోయాయి. వీటిని తట్టుకోలోని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యనమలకుదురుకు చెందిన ఎర్రపోతు కావ్యశ్రీ(19)కి, ఎన్టీఆర్‌ జిల్లా కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్‌కు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. శ్రీకాంత్‌ పాతపాడు సచివాలయంలో కార్యదర్శి కాగా.. వీరికి 10 నెలల కుమార్తె ఉంది. కావ్యశ్రీ ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. మూడు రోజుల కిందట భర్త ఈమెను విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లి స్కానింగ్‌ చేయించగా మళ్లీ ఆడపిల్లని తెలిపారు. 
 
అప్పటి నుంచి భర్త, అత్తింటి వారి వైఖరి పూర్తిగా మారిపోయింది. తమకు వారసుడు కావాలని అబార్షన్‌ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దీనికి కావ్యశ్రీ ససేమిరా అన్నారు. అయినా వారు వినకుండా అబార్షన్‌ చేయించుకోవాలంటూ రెండుసార్లు బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లినా ఈమె అంగీకరించలేదు. ఇలా అత్తింటి వారి వేధింపులు పరాకాష్టకు చేరగా.. అప్పటి నుంచి కావ్యశ్రీ యనమలకుదురులోని పుట్టింటికి వచ్చేసింది.
 
గత నెల 31వ తేదీన భర్త ఈమె వద్దకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈనెల రెండో తేదీ ఉదయం కావ్యశ్రీ స్నానానికి వెళ్తున్నట్లు భర్తకి తెలిపి బాత్రూముకు వెళ్లింది. ఎంతకూ బయటకు రాకవపోవడంతో భర్త, ఈమె తల్లిదండ్రులు బాత్రూము తలుపులు పగలగొట్టి చూడగా లోపల వెంటిలేటర్‌ రాడ్‌కు చున్నీతో ఉరేసుకొని వేలాడు కనిపించింది. వెంటనే ఈమెను విజయవాడ పటమటలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. 
 
తమ కుమార్తెను భర్త, అత్తింటి వారు అబార్షన్‌ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడిందని కావ్యశ్రీ తండ్రి ఎర్రపోతు రాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  భర్త శ్రీకాంత్, అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును తాత్కాలికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ టీవీవీ రామారావు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు