ఏపీ టూరిజం అధికారి మొత్తుకున్నా.. దండం పెట్టినా... బోటు తీశారు..

సోమవారం, 13 నవంబరు 2017 (14:03 IST)
పవిత్ర సంగమం వద్ద బోటు తిరగబడింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్న వేళ.. ప్రమాదానికి ముందు బోటును తీయకూడదని పర్యాటక సిబ్బంది హెచ్చరించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన బోటు నిర్వాహకులతో ఏపీ టూరిజం అధికారి వాగ్వాదానికి దిగారు.
 
రివర్ బోటింగ్ అడ్వెంచర్ సంస్థ దుర్గా ఘాట్ నుంచి బోటును నడిపేందుకు ప్రయత్నించగా, ఏపీ టూరిజం అధికారి అడ్డుకున్నారు. అక్కడ బోటు నిలపడానికి కూడా వీల్లేదన్నారు. ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి లేదంటూ స్పష్టం చేశారు. అంతేగాకుండా దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఆయన సదరు బోటు నిర్వాహకులను దండం కూడా పెట్టారు. ప్రయాణికులను ఎక్కించుకోవడానికి తమ బోట్లు ఉన్నాయని, మీరు వెళ్లిపోవాలంటూ ఆయన స్పష్టం చేశారు. లేకపోతే బోటును ఇక్కడ నుంచి బలవంతంగా పంపించేస్తామంటూ హెచ్చరించారు. దీంతో, డ్రైవర్ బోటును తీసుకుని వెళ్లిపోయాడు.
 
ఇది జరిగిన కాసేపటికే అదే బోటు భవానీ ఐలాండ్ నుంచి పవిత్ర సంగమంకు పర్యాటకులను ఎక్కించుకుని దొంగచాటుగా బోటు బయల్దేరింది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నా, అంతకు ముందే ఏపీ టూరిజం అధికారి హెచ్చరించినా లెక్క చేయకుండా... ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిన బోటు యాజమాన్యం.. 19 ప్రాణాలు తీసింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు