చీటింగ్ ముఠాను ప‌ట్టించిన కానిస్టేబుల్... అభినందిస్తూ టీ ఆఫ‌ర్ చేసిన ఎస్పీ!

బుధవారం, 15 డిశెంబరు 2021 (17:56 IST)
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎస్పీ సిద్ధార్థ కౌశ‌ల్ ఒక గొప్ప అనుభూతిని ఓ సాధార‌ణ కానిస్టేబుల్ కి అందించారు. కానిస్టేబుల్ కుటుంబంతో క‌లిసి తేనీరు సేవించి, వారి స‌మ‌క్షంలోనే కానిస్టేబుల్ ని అభినందించారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కేసును జగ్గయ్యపేట కానిస్టేబుల్ వి. ల‌క్ష్మీనారాయ‌ణ ఛేదించాడు. అందుకు ఎస్పీ ఆయ‌న‌ను అభినందించారు.
 
 
రోజురోజుకీ పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న ఉపాధి అవకాశాలు ఇవన్నీ అమాయక ప్రజలను నేరుగా నేరగాళ్ల ఉచ్చులోకి లాగుతున్నాయి. ఇంటి వద్దనే ఉద్యోగాలని, పేపర్లో ప్రకటన ఇచ్చి సుమారు 40 మందికి పైగా అమాయకులను మోసం చేసి 8 లక్షలకు పైగా నగదు కాజేసిన ముఠా గుట్టును కానిస్టేబుల్  రట్టు చేశారు. ఇందులో ప్రతిభ కనపరిచిన జగ్గయ్యపేట కానిస్టేబుల్-2143  వి. లక్ష్మీనారాయణకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందజేసి, అభినందనలు తెలియజేశారు.
 
 
గతంలో ఎన్నడూ లేనివిధంగా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలను పిలిచి వారి సమక్షంలో కానిస్టేబుల్ చేసిన సేవలను అభినందిస్తూ, అవార్డు ను అందజేయడం ఆ కుటుంబ సభ్యుల్లో అమిత ఆనందాన్ని నింపింది.
 
 
జగ్గయ్యపేట కు చెందిన ఒక యువతి పేపర్లో వచ్చిన ఉద్యోగ ప్రకటన చూసి కాంటాక్ట్ నెంబర్ కు సంప్రదించగా, వారు దివానా ఆగ్రో కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, మీకు ఉద్యోగం వచ్చిందని ప్రాసెస్ కొరకు కొంత అమౌంట్ పే చెయ్యాలన్నారు. కంపెనీ ఎకౌంట్ నెంబర్ ఇవ్వగా, వారు అడిగినంత మొత్తాన్నివారి ఖాతా కు డిపాజిట్ చేశారు. కానీ ఉద్యోగం రాక‌పోవ‌డంతో మోసపోయానని గ్రహించిన ఆమె స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 
 
 
ఆ ఫిర్యాదును స్వీకరించి, దాని ద్వారా కేసు పూర్వాపరాలను దర్యాప్తు చేయడంలో కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ అత్యంత కృషి చేసి నిందితులను అదుపులోకి తీసుకోవడంలో అత్యంత ప్రతిభ కనబరిచాడు. ఇప్పటి వరకు మొత్తం 40 మందికిపైగా అమాయకులను మోసం చేసి వారి వద్ద 8 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా విచారణలో వెల్లడి అయింది. ఎవరికీ దొరక్కుండా అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చెయ్యడంలో ప్రతిభ కనబరచిన కానిస్టేబుల్ కి వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. 
 
 
అనంతరం వారి కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి, వారికి తేనీరు అందించి, పోలీస్ ఉద్యోగం కారణంగా కుటుంబ జీవితం ఎలా మిస్ అవుతున్నారు, కుటుంబ నేపథ్యం అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులందరి ముందు అత్యుత్తమ గౌరవం దక్కినందుకు కానిస్టేబుల్ కన్నీటి పర్యంతమై ఎస్పికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కుటుంబ సభ్యులందరి ముందు అవార్డును అందజేసి, కిందిస్థాయి ఉద్యోగుల పట్ల సహృదయంగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు ఎస్.పికి ధన్యవాదాలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు