బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి తనకు కాబోయే భార్యను ఒకసారి చూసి రావొచ్చని బయలుదేరిన వరుడు.. గమ్యం చేరకుండానే అనంతలోకానికి చేరుకున్నాడు. ఈ సంఘటన ఇటు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చగా.. అటు కట్టుకోబోయే యువతి కుటుంబంలో విషాదం నింపింది. 16వ నంబరు జాతీయ రహదారిపై దెందులూరు మండలం శింగవరం పరిధిలో ఆదివారం జరిగిన రహదారి ప్రమాదంలో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఎస్.కె. ఫరీద్(23) అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఎస్.కె.జాఫర్, ఆషాల పెద్ద కుమారుడు ఫరీద్ సీలింగ్ పనులు చేస్తూ తల్లిదండ్రులకు అండగా ఉంటున్నాడు. అతనికి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. తాంబూలాల కార్యక్రమం పూర్తి కాగా మార్చి 3న వివాహం చేయడానికి నిశ్చయించారు. వృత్తి రీత్యా విజయవాడలో ఉంటున్న ఫరీద్ పెళ్లి కార్డులు పంపిణీ చేయడానికి ద్విచక్ర వాహనంపై నిడదవోలు బయలుదేరాడు.
దెందులూరు మండలం శింగవరం పరిధిలోకి వచ్చేసరికి అప్పటికే సంఘటన ప్రాంతంలో ముందు వెళ్తున్న కారును తప్పించే క్రమంలో టిప్పర్ లారీ కారును ఢీకొంది. దీంతో కారు ఫుట్‌పాత్ పైకి వెళ్లి ఆగింది. టిప్పర్ రహదారి మధ్యలో ఆగిపోయింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఫరీద్ టిప్పర్‌ను వెనుకవైపు నుంచి ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దెందులూరు ఎస్.ఐ. స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు.