కర్నూలు సమీపంలోని మునగాలపాడు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మునగాలపాడులో రాములమ్మ అనే మహిళ ఇంటి ముందు గుర్తుతెలియని దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఇంటి ముందు పుర్రెలు, చీపురు, కుంకుమ కనిపించేసరికి ఆ మహిళ భయాందోళనకు గురయ్యారు. తనపై క్షద్రపూజలు చేశారేమోనని భయపడిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పసుపు, కుంకుమ చల్లి పుర్రె, ఎముకలు, నిమ్మకాయలు, చీపురుకట్ట పెట్టడంతో గ్రామంలో అనుమానాలు, భయాందోళనలను రేకెత్తాయి. సునీల్ అనే వ్యక్తి దగ్గర రాములమ్మ ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటూ కూలి పని చేసి జీవనం సాగిస్తోంది.
ఇంటి యజమాని సునీల్ మాట్లాడుతూ.. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఎవరితోనూ గొడవలు లేవని, అయినా తమ ఇంటి ముందు క్షుద్రపూజలు ఎందుకు చేశారో? ఎవరు చేశారో అంతుచిక్కడం లేదని, ఒకరకంగా భయం కలుగుతోందని అన్నారు. మరోవైపు రాములమ్మకు ఎవరైనా హాని తలపెట్టడానికి ఈ పని చేసి ఉంటారా? అన్న కోణంలో కూడా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.