రైల్వే శాఖలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అత్యంత కష్టమైన రైల్వే గార్డ్‌గా విధులు నిర్వహించేందుకు సైతం సై అంటున్నారు. సాధారణంగా ప్రయాణీకులను చేరవేసేటువంటి రైళ్లలో రైల్వే గార్డ్‌గా పని చేయడం అంత కష్టం కాకపోవచ్చు, కానీ సరుకులు తీసుకెళ్లే వాణిజ్యపరమైన గూడ్స్ రైలులో రైల్వే గార్డుగా విధులను నిర్వర్తించడం మాత్రం కత్తి మీద సామే అని చెప్పాలి.
ఎందుకంటే గూడ్స్ రైళ్లను ఎక్కడపడితే అక్కడ, ఏ సమయంలోనైనా ఆపేస్తారు. ఆ సమయంలో కూడా రైల్వే గార్డులు ధైర్యంగా పని చేయాలి. రాత్రి సమయాల్లో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలలో రైలును ఆపినా, విధి నిర్వహణలో ఎలాంటి బెరుకు లేకుండా ఉండాలి. నిన్న మొన్నటి వరకు ఈ పని చేయడం మహిళలకు సాధ్యం కాదు అని అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ మహిళా లోకం ముందుకు వస్తుంది.
అందులో భాగంగానే ఓ మహిళ గూడ్స్ రైలు గార్డ్‌గా నియమితులయ్యారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఈ మహిళ విధులు నిర్వర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాధవి అనే మహిళకు శిక్షణను అందించారు, అలాగే ఆమెకు వర్కింగ్ ఆర్డర్‌ను అందజేసామని కాజీపేట రేల్వే ఏరియా ఆఫీసర్ వెల్లడించారు.