బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: భారీ వర్షాలు కురిసే అవకాశం

శనివారం, 30 అక్టోబరు 2021 (13:03 IST)
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. క్రమంగా తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనంతో పాటు బంగాళాఖాతంలో నవంబర్ 6న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. 
 
ప్రస్తుతం అల్పపీడనం 3-4 రోజుల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక ఉత్తరాంధ్ర తీరంలో ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 
 
రానున్న 3 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం సగటు నమోదైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు