బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి తీరం దాటొచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్, ఇతర వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని భావిస్తున్నాయి.
మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వానలు కురిశాయి. సోమవారం పల్నాడు, తూర్పుగోదావరి, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి.