తేడా తెలియని వ్యక్తి వద్ద పనిచేయలేను : జనసేనకు కీలక నేత గుడ్‌బై

సోమవారం, 12 ఏప్రియల్ 2021 (08:08 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం తప్పుకున్నారు. ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రాజీనామా చేశారు.
 
ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నాయన్నారు. ఈ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ ఏనాడూ ఖండించలేదన్నారు. దీంతో ఆయన మౌనం నిజాన్ని అంగీకరించినట్టుగా భావిస్తున్నారని అన్నారు.
 
ఇకపోతే, తాను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఓటర్లకు పవన్ అండగా నిలవలేదని, సినిమాలు, రాజకీయాలు వేరని, వాటి మధ్య తేడా తెలియని వారితో తాను పని చేయలేనని అన్నారు. 
 
ప్రజలు ఆశించినట్టుగా జనసేన పని చేయడం లేదని ఆరోపించారు. కాగా, గంగాధరం, జనసేన పార్టీలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్‌గా పని చేసి, ప్రస్తుతం ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారన్న సంగతి తెలిసిందే. 
 
కాగా, ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు