నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శనివారం, 6 మార్చి 2021 (11:12 IST)
శ్రీకాళహస్తీశ్వరాలయ మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈనెల 19వతేదీ వరకు జరిగే ఉత్సవాలకు భోళాశంకరుడికి పరమభక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో అంకురార్పణ జరగనుంది.

ఇందుకోసం మధ్యాహ్నం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని ఆలయ సమీపంలోని భక్తకన్నప్ప కొండపైకి ఊరేగింపుగా తీసుకెళతారు. మూడు గంటల ప్రాంతంలో ధ్వజారోహణం నిర్వహించి వైభవంగా బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.

అనంతరం స్థానిక ధూర్జటి కళాప్రాంగణంలో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలను ప్రముఖ సినీగాయని పి.సుశీల జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించనున్నారు. తర్వాత ప్రముఖుల ఉపన్యాసం, ప్రముఖ కళాకారుల నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భిక్షాల గాలిగోపురం, సమాచారకేంద్రం కూడలి, పెండ్లిమండపం, భేరివారి మండపం ప్రాంతాల్లో చలువ పందిళ్లను సిద్ధం చేశారు.

కాగా.. మదనపల్లెకు చెందిన జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ రాటకొండ గురుప్రసాద్‌ దంపతులు శుక్రవారం స్వామికి పట్టువస్త్రాలు కానుకగా సమర్పించారు. 
 
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తదితరులు ఆహ్వానించారు. శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈవో పెద్దిరాజు, అర్చకులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు